ఏదో టైటిలు బాగుందని అట్టా అన్నాను గానీ “నెనర్లు” ఒక తెలుగు పదముందంటే నాకింకా నమ్మబుద్ధి కావట్లేదు. నాకు తెలియని బోల్డు తెలుగు పదాలుండొచ్చు, నేను కాదనను. ఈ పదాన్ని దాదాపు ఏడాది నించీ వింటున్నా… ప్చ్… అబ్బే… ఉపయోగించటం సంగతి అటుంచి ఎవరైనా వాడితే అదెంటో ఎబ్బెట్టుగా ఉంటుంది.
ఇది మరీ బావుంది, నువ్వెవరూ ఏది తెలుగో ఏది కాదో నిర్ణయించడానికంటారా… మీరక్కడే తప్పులో కాలేశారు. నేను అది తెలుగు కాదనటంలా. దీన్ని వాడ్డం కాదు కదా వినడానికి కూడా (నాకు) (కష్టంగా ఉంది) ఇష్టంగా లేదు అంటున్నా. ఎంటీ? ఎందుకు? అంటారా… అదో అక్కడికే వస్తున్నా. ఎందుకో తెలీదు ఇది విన్నప్పుడల్లా ఇది అరవ పదానికీ ఇంగ్లీషు ఫీలింగుకీ పుట్టిన మళయాలీ పిల్లపదాన్ని అరబ్బీ వాడినట్టుంటుంది. ఎందుకుంటుందీ అంటే నాదగ్గర సమాధానం లేదు. బహుశా నేను జీవితంలో తిన్న కొన్ని ఢక్కా మొక్కీ లనుకుంటా.
భాష భావాన్ని తెలపడానికి మాత్రమేపుట్టింది అనేది నా ఫీలింగ్. భావాలు ఆచారవ్యవహారాల నించీ, కష్ట నష్టాల నించీ వస్తాయనేది నిర్వివాదాంశం. భావం ఒకటే అయినా దాన్ని వ్యక్తంచేసే తీరు దేశాన్ని బట్టీ ప్రదేశాన్ని బట్టీ మారుతుంటుంది, ఇక పదాల సంగతి చెప్పఖ్ఖర్లేదు. చిన్న చిన్న వాటికి “thanks” చెప్పటం మన ఆచారమూ కాదు, అలవాటు అంతకంటే కాదు. కానీ, “చచ్చి నీ కడుపునపుడతా”, “నీ రుణం ఉంచుకోను” లాంటివి చాలానే వున్నాయి. కానీ ఈ “thanks” మనది కాదనేది నా గట్టి ఫీలింగ్. నేను “thanks” చెప్పొద్దనట్లేదు. దాన్ని “thanks” గానే వుంచితే ఏంపొయ్యింది, మనది కాని భావాన్ని తెనుగించడం అవసరమా అని (అందులో మరీ ఇంత దారుణంగా)?
ఒక సర్వసాధారణమైన వ్యవహారాన్నే తీసుకుందాం. మీరు పరధ్యానంగా ఎదురుగా వస్తున్న వ్యక్తిని గుద్దేశారు అనుకుందాం. మన ఊళ్ళో అయితే “చూళ్ళేదండీ” అంటాం. అదే ఆఫీసులో అయితే “సారీ” అంటాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనం వాడుతున్న పదాలే కాదు వ్యక్తం చేస్తున్న భావాలు కూడా వేరు. ఒకచోట “explanation” ఇస్తున్నాం. ఇంకో చోటేమో అటువంటిదిలేదు. ఇంత అతిసాధారణ విషయానికే భావం తేడా, expression తేడా వుంటుంటే రెండు భాషల మధ్య ప్రతీ పదానికీ “వ్యావహారిక సమానార్థమయిన పదం” ఉండాలనుకోవటం అమాయకత్వం అని నా అభిప్రాయం.
ఇంతకీ ఢక్కామొక్కీల గురించి చెప్పలేదుకదూ…
అనగనగా ఒక తరగతి గది. పంతులుగారు పిల్లలకి ఒక్కొక్కళ్ళ పేర్లు పిలిచి వాళ్ళ ఆన్సరు పేపర్లు ఇస్తున్నారు.
“రాజూ…”
“సరితా…”
“రమణా…”
“సెవెన్ హిల్స్…”
“…”
“…”
“…”
సూది పడ్డా వినిపించేత నిశ్శబ్దం. మరందుకే మక్కికి మక్కీ తర్జుమా చెయ్యొద్దనేది.
ఇంత చెప్పినందుకు మీరు నాకు “నెనర్లు” చెబితే, నేను చెయ్యగలిగిందేమీ లేదు. “మీకు స్వాగతం” అనడం కంటే”.
