దిల్ సే …

మార్చి 28, 2008

గ్రహణం — సినిమా గురించి కాదు

ఈసారి ఒక చిన్న ఎపిసోడ్.

ఆమధ్య ఒకసారి, మూడేళ్ళక్రితం అనుకుంటా, ఒక మిత్రుణ్ణి కలవడానికని వెళ్ళా (ఇది నిజంగా జరిగింది, ఇక్కడలా కథ కాదు). వాడు హైదరబాదులో భరత్‌నగర్‌లో వుంటాడు. నన్నో చిన్న హోటల్‌కి (పూటకూళ్ళ ఇంటికి) తీసుకెళ్ళాడు. మాటల్లో ఆ హోటల్ ఓనర్ “గ్రహణం” సినిమా ప్రొడ్యూసర్ అనో ఫైనాన్షియర్ అనో చెప్పాడు.
తినడం మొదలు పెట్టబోతుండగా మావాడికి ఒక డౌటు వచ్చింది. ” ఆ ఫోటోలు ఇంతకు ముందు ఈవైపు ఉండాలి కదా, ఏంటి అటు వైపుకి మార్చారు?” అని. అదేమాట క్యాషియర్ని అడిగాడు (మేము క్యాషియర్ కి దగ్గర్లోనే ఉన్నాము). అతను బుర్ర తిరిగే సమాధానం ఇచ్చాడు.

“అటు వాస్తు బాగాలేదని ఇటు పెట్టారంట”.

ప్రకటనలు

మార్చి 20, 2008

సినిమా తీద్దాం రా!

not happening!

not happening!

not happening!

అనుకుంటూ కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతున్నాడు ఏకలింగం™. యేదయినా సాధించాలన్న ఆశ వాళ్ళావిడ తనని సాధించడం మొదలుపెట్టటంతో చచ్చిపోయింది. కానీ యెప్పటికయినా ఒక తెలుగు సినిమా డైరెక్టు చెయ్యాలన్న ఆశ ఒకమూల వుండి పోయుంది. కొన్నాళ్ళుగా ప్రాజెక్టూ మారలేదు, పెళ్ళయ్యాక కంపెనీ మారే ఉద్దేశ్యమూ లేదు. దాంతో ఆ ఆశని బయటకితీసి ఒక రూపాన్నివ్వసాగాడు. నెట్ మీద పుస్తకాలు చదివాడు. వీకెండు “తొక్కలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీ” లో ట్రెయినింగ్ తీసుకున్నాడు. ఫ్రెండ్సుని కలవమన్నాడు. ఒకరిద్దరు సరే అన్నా అది కార్యరూపం దాల్చలేదు. అతి కష్టమ్మీద ఒక ప్రొడ్యుసర్ని దొరకబుచ్చుకొన్నాడు. తన పేరు కోటిలింగాల చౌదరి.

చౌదరీ, తనూ ఒక హొటల్‌లో మొదటిసారి కలిశాక “మాంఛి” సినిమా తియ్యాలని ఒక నిర్ణయానికొచ్చారు. స్టొరీ డిస్కషన్స్ కోసం ప్లాన్ చేస్తుంటే ఫోనొచ్చింది. అటు కోటిలింగాల చౌదరి. చౌదరి అన్నాడు, “లింగం, మన ఇండస్ట్రీలో స్టొరీతో కాదయ్యా సినిమా మొదలు పెట్టేదీ, ముందు హీరో డేట్సు కావాలి. మన ప్రొడక్షను ఆఫీసుకొచ్చెయ్” అని. చాలా తర్జన భర్జనల తర్వాత వేటకెళ్ళేటప్పుడు పులికుండే కళ్ళ లాంటి కళ్ళున్న హీరో ని అప్రోచ్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. సూట్‌కేసు నిండా నోట్ల కట్టల్తో బయల్దేరారు, బుక్ అయితే అప్పుడే అడ్వాన్సు ఇవ్వాలిగా మరి! తీరా చూస్తే ఆయనేమో యేడాదికి ఒక్కసినిమానే చేస్తాడు, మూడు నాలుగేళ్ళదాకా బుక్కయిపొయ్యాడు. ఈసురోమంటూ ప్రొడక్షను ఆఫీసుకి వచ్చేశారు.
ఫుల్ల్ మాస్ ఫాలోయింగున్న ఇంకో హీరోని బుక్‌చేసుకుందామనుకున్నారు. ఆయన ఈమధ్య బాగా సన్నబడి స్మార్ట్‌గా తయరయ్యాడు. ఆయనేమో ఎవ్వడు డబ్బులు ఎక్కువ ఇస్తే వాడికి డేట్లు ముందు ఇస్తాడంట. “మరి ముందు బుక్ చేసుకున్నవాడి సంగతేంటి? ఇంక ఈలెక్కన సినిమా ఎప్పటికి పూర్తవ్వాలీ?” అన్నాడు చౌదరి. “సార్ మనం మంచి లవ్‌స్టోరీ చేద్దాం. నాదగ్గర మెస్సేజ్‌తో, సెంటిమెంట్, లవ్ కలిపిన స్టోరీ వుంది. యూత్‌కి లవ్‌స్టోరీ, ఫామిలీస్‌కి సెంటిమెంట్” అన్నాడు ఏకలింగం™. చౌదరి ఎలాగోలా కన్విన్స్ అయ్యాడు. సూర్యకిరణ్ అని అందంగా వుండి అదృష్టం లేని హీరోని పట్టేశారు. డేట్సు సులభంగానే దొరికాయి. ఎంత గొడవ పెట్టినా చౌదరి వింటేగదా. కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా తియ్యడానికి తనేమీ Steven Spielberg కాదు. ఇదే అదనుగా ఇది లవ్‌స్టోరీ అనీ, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదిలేదని చెప్పేశాడు.

హీరోయిన్‌ని వెతికేటప్పటికి తలప్రాణం తోకకొచ్చింది. ముంబాయి అంతా తిరిగి పుల్లలాటి పుల్లా లింగానియా ని పట్టారు. ఈసారీ ఏకలింగం™ గొడవపెట్టాడు. చివరికి పంతం నెగ్గించుకొన్నాడు. (చీర కట్టినప్పుడు) కాస్త తెలుగుదనం కనిపించే ఒక అమ్మాయిని బుక్ చేశారు. మంచి మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకున్నందుకు కెమేరా మ్యాన్‌, మిగతా క్రూ విషయంలో కాంప్రమైజ్ అవ్వక తప్పలేదు.

ఎలాగోలా సినిమా షూటింగ్ అయితే అయ్యింది. అంతా అయ్యేప్పటికి ఏడాది దాటింది. రష్షెస్ చూసిన వాళ్ళ కామెంట్సు విని ఏకలింగం™ దిమ్మతిరిగింది.
“స్టార్సు లేకుండా సినిమా యేంటండీ? యెవ్వడు కొంటాడూ? ”
“సెంటిమెంటు సీన్స్‌లో హీరో దొబ్బెట్టాడు… కనీసం డబ్బింగ్ అయినా వేరొకరితో చెప్పించండి…”
“హీరోయిన్ డబ్బింగు జాగర్త, సునీతని తీసుకోవద్దు. ఆవిడ డబ్బింగ్ తెలుగమ్మాయిలా వుంటుంది.”
“సెంటిమెంటు సీన్సు రీషూట్ చెయ్యాలేమో? ”
“మ్యూజిక్ పర్లేదు”
“ఫూటేజ్ ఇంతతక్కువా… ఎడిటర్ అయిపొయ్యాడే.”
“ఇంత కష్టపడీ మంచి కెమేరా మ్యాన్‌ని పెట్టుకోలేదే?”

రిలీజు చేద్దామంటే డేట్సు కుదరట్లేదు. థియేటర్లన్నీ పెద్ద హీరోలకే బుక్కయిపొయ్యాయి. ఎలాగోలా కొన్ని థియేటర్లు కుదిరాయి. రిలీజ్ అయ్యేలోపు ల్యాబుకి కట్టాల్సిన డబ్బు అమరేట్టు లేదు. చౌదరి తన అసలు ప్లాను చెప్పాడు. “సూర్యకిరణ్ కి తమిళ్‌లో కూడా డిమాండ్ ఉంది. డబ్బింగ్ రైట్సుతో కొంత సొమ్ము చేసుకోవచ్చు” అని. రైట్సు అమ్మారు. అంతా కలిపినా డబ్బు సరిపోలేదు. చౌదరి వాళ్ళావిడ బంగారం అమ్మేశాడు. ఎలాగోలా డబ్బు కట్టేశారు. అయినా ప్రింట్లు రానివ్వట్లేదు. ఏంట్రా అంటే తమిళ్ లో రైట్సు తీసుకున్న వెధవకి అక్కడ ల్యాబు వాళ్ళతో ఏవో గొడవలు. ఎలాగోలా సినిమా రిలీజయింది. యెప్పుడు వచ్చిందో యెప్పుడు పోయిందో యెవరికీ తెలియదు.

ప్రొడ్యుసర్ గురించి నన్నడక్కండి, పత్తా లేడు. మన ఏకలింగం™ వీకెండ్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అటెండు అవుతున్నాడు… రాత్రుళ్ళు మేలుకుని అప్పుడప్పుడూ గొణుక్కుంటుంటాడు “సినిమా తియ్యడం బ్లాగురాసినంత వీజీ కాదు” అని. నెట్ మీద ఇంకా పుస్తకాలు చదువుతున్నాడు. ఈసారి… “ఎదుటి వారిని కన్విన్స్ చెయ్యడం ఎలా?” గురించి…
అప్పుడప్పుడూ పాత ఫిల్మ్ ఇండస్టీ ఫ్రెండ్సు కనిపిస్తే వాళ్ళని టిప్స్ అడుగుతుంటాడు.
“హీరో డేట్సు సంపాదించటం ఎలా?”
“థియేటర్లు రిజర్వు చేసుకోవడం ఎలా?” అని.

———————–
(నాకు ఫిల్మ్ మేకింగ్ మీద పూర్తి అవగాహన లేదు, technical errors వుంటే తెలుపగలరు).
–శ్రవణ్

మార్చి 15, 2008

రెండు సరదా సన్నివేశాలు

అవి నేను బైకు నడపడం కొత్తగా నేర్చుకుంటున్నరోజులు…

వెధవ ఆవేశం… డ్రైవింగు వచ్చీరాకుండానే మొదటిసారి మెయిను రోడ్డుమీదకి బయలు దేరాను. నాకలే భయమెక్కువ. కొంచెం దూరంలో జంక్షనూ, ట్రాఫిక్‌లైట్లూ పక్కనే యమభటుడిలా ఒక ట్రాఫిక్ కానిస్టేబులు. రెడ్‌లైటు పడుతుందేమోనని భయం.
ట్రాఫిక్ పోతూందీ…
పోతూందీ…
పోతూందీ…
“దేవుడా రెడ్‌లైటు పడకుంటా ఉంటే బాగుణ్ణు” అనుకుంటుండగానే రెడ్‌లైటు పడటమూ నా బైకు ఆగిపోవటమూ కొంచెం అటూ ఇటూగా జరిగిపోయాయి. కొత్త బైకూ, కొత్త పెళ్ళామూ ఒక పట్టాన లైన్లో పడవంటారు. తగ్గట్టు డ్రైవింగు కొత్త. ఇంక చెప్పేదేముంది? గ్రీన్ లైటు పడేవరకూ బైకు స్టార్టవక పోవకపోవటమూ, కానిస్టేబులు మనల్ని పక్కకి పిలవడమూ నాచురల్‌గానే జరిగాయి. కొంతసేపు సర్ది చెప్పబోయాను. ఏమాత్రమూ వదిలేట్టుగాలేడు. నెలాఖరు అనుకుంటా! వాడిమొహానేమయినా కొడదామా అంటే జేబులో పర్సు లేదు.
అసలు ట్విస్టు ఇక్కడ వుంది. “I really need to go $#@!…Blah…Blah..” అని మొదలు పెట్టి డిక్షనరీ లోమాత్రమే తగిలే కాస్త గఠ్ఠి పదాలు నాలుగు అద్దాను. ఈ ట్రిక్కు ఎప్పుడయినా వాదించేప్పుడు తప్పనిసరయితే వాడేవాణ్ణి. అవతలివాడు ఇంగ్లీషులో కొంచెం వీక్ అయితే ఈ ట్రిక్ భలే పని చేస్తుంది. వాడి ఈగోకి గట్టి దెబ్బేతగులుతుంది. ఆటోమాటిక్‌గా డిఫెన్సులో పడతాడు. ఇదే అదనుగా మనం ఇంక వాణ్ణి ఆడుకోవడమే. ఆ ట్రిక్కు ఇప్పుడు కూడా పని చేసింది.
నేను మాట్లేడేది తనకి అర్థం కావట్లేదని అతని మొహంలో రంగులు మారడం చెబుతూంది. ఇంకేముంది, రెట్టించిన ఉత్సాహంతో మరి నాలుగు పదాలు అద్దాను. “ఇంత చదువుకుంటారూ… డ్రైవింగు లైసెన్సులుండవూ…” అంటూ చిన్నగా నసిగి వెళ్ళనిచ్చాడు ట్రాఫిక్ కానిస్టేబులు. హమ్మయ్య, అనుకుని బయట పడ్డాను  🙂

o~8~O~8~o

కాలేజీ రోజుల్లో …

ఆ శనివారం దూరదర్శన్ లో “మాతృదేవోభవ” వస్తుంది. జనరల్‌గా D.D లో సినిమా అంటే మా బ్యాచ్‌లోంచి ఎవ్వడూ చూడడు. ఒకవేళ ఏదయినా మంచి సినిమా వచ్చినా సరే, ఎవడయినా చూస్తున్నాడంటే వాడిని ఆతర్వాత రెండుమూడు వారాలు “పండగ” చేసుకుంటారు ఫ్రెండ్స్అంతా కలసి.
సరే, సినిమా స్టార్ట్ అయ్యింది…
మాబ్యాచ్ లోంచి ఒకడన్నాడు “అరే ఒకట్రెండు సీన్స్ బావుంటాయిరా. అవి రెండూ చూసొస్తా, పనిలో పనిగా యెవడయినా వున్నారేమో చూసొస్తా; రేపటికి మనకి యెవడైనా బకరా కావాలిగా” అని. అన్నవాడు చిన్నగా జారుకున్నాడు. వాడి వెంట ఇంకొకడు, ఆ పై మరొకడు. నావంతు రాకముందే మిగిలిన ఒక్కణ్ణీ తీసుకుని బయలుదేరాను. యెవడయినా రెడ్‌హ్యాండెడ్‌గా దొరికితే పండగ చేద్దామనుకుని వెళ్ళాము.

అంతా నిశ్శబ్దం… చీమ చిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్దం. ఒకడు పైకి సౌండ్ రాకుండా చిన్నగా ఏడుస్తున్నాడు, వాణ్ణి ఏదో కామెంటు చెయ్యబోతే పక్కవాళ్ళంతా మమ్మల్ని వింత మనుషుల్లా చూశారు. సరే ఇక చేసేదేముంది… మేమూ చూడ్డం మొదలెట్టాం. కొంతసేపటికి నాకూ యేడుపొచ్చింది. యేడిస్తే ఎలా, కంట్రోల్ చేసుకున్నా. ఇంకాసేపటికి కంట్రోల్ చేసుకోవడం నావల్లకాలేదు. నారూములోకెళ్ళి బోల్టు పెట్టుకుని ఐదు నిమిషాలసేపు ఏడ్చేశా. నీట్‌గా మొహం కడుక్కుని మళ్ళీ సినిమా చూస్తున్న వాళ్ళతో జాయినయ్యా.

ఇంతలో జరక్కూడనిది జరిగి పోయింది, బ్యాచ్‌లోంచి యెవడో చూడనే చూశాడు. ఇక చెప్పేదేముంది…తర్వాత రెండుమూడు వారాలు నేను బలి…

o~8~O~8~o

మార్చి 4, 2008

గూగుల్ Vs వికీపీడియా

Filed under: సాఫ్టువేరు,biased — శ్రవణ్ @ 12:52 సా.
Tags: , , , ,

నా మిత్రుల్లో “internet explorer” వాడ్డం మానేసినవాళ్ళు చాలామందే వున్నారు. ఎప్పుడో తప్పనిసరి అయితే తప్పించి దీన్ని వాడరు. అంతా firefox వాడతారు. నేనూ ఈ వర్గానికి చెందిన వాణ్ణే. కారణం open source tools లో proprietary tools ని తలదన్నేదిగా దీన్ని గుర్తించడమే. ఇంత క్వాలిటీ ఉన్నవి కొన్నిమాత్రమే. ఈ చిట్టాకి “wikipedia search” చేర్చాలనేది నా అభిమతం. నేను ఇంకొక్క అడుగు ముందుకేసి firefox లో “default search” కి “wikipedia”  వాడుతున్నాను. మీరూ ప్రయత్నించండి.

హోం పేజీ గా “గూగుల్ search” నే ఇంకా వాడతాననుకోండి, అది వేరే విషయం.

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.