దిల్ సే …

ఆగస్ట్ 14, 2008

తెలుగు భాషలో నాకు నచ్చని ఒకేఒక్క పదం — “నెనర్లు”

ఏదో టైటిలు బాగుందని అట్టా అన్నాను గానీ “నెనర్లు” ఒక తెలుగు పదముందంటే నాకింకా నమ్మబుద్ధి కావట్లేదు. నాకు తెలియని బోల్డు తెలుగు పదాలుండొచ్చు, నేను కాదనను. ఈ పదాన్ని దాదాపు ఏడాది నించీ వింటున్నా… ప్చ్… అబ్బే… ఉపయోగించటం సంగతి అటుంచి ఎవరైనా వాడితే అదెంటో ఎబ్బెట్టుగా ఉంటుంది.

ఇది మరీ బావుంది, నువ్వెవరూ ఏది తెలుగో ఏది కాదో నిర్ణయించడానికంటారా… మీరక్కడే తప్పులో కాలేశారు. నేను అది తెలుగు కాదనటంలా. దీన్ని వాడ్డం కాదు కదా వినడానికి కూడా (నాకు) (కష్టంగా ఉంది) ఇష్టంగా లేదు అంటున్నా. ఎంటీ? ఎందుకు? అంటారా… అదో అక్కడికే వస్తున్నా. ఎందుకో తెలీదు ఇది విన్నప్పుడల్లా ఇది అరవ పదానికీ ఇంగ్లీషు ఫీలింగుకీ పుట్టిన మళయాలీ పిల్లపదాన్ని అరబ్బీ వాడినట్టుంటుంది. ఎందుకుంటుందీ అంటే నాదగ్గర సమాధానం లేదు. బహుశా నేను జీవితంలో తిన్న కొన్ని ఢక్కా మొక్కీ లనుకుంటా.

భాష భావాన్ని తెలపడానికి మాత్రమేపుట్టింది అనేది నా ఫీలింగ్. భావాలు ఆచారవ్యవహారాల నించీ, కష్ట నష్టాల నించీ వస్తాయనేది నిర్వివాదాంశం. భావం ఒకటే అయినా దాన్ని వ్యక్తంచేసే తీరు దేశాన్ని బట్టీ ప్రదేశాన్ని బట్టీ మారుతుంటుంది, ఇక పదాల సంగతి చెప్పఖ్ఖర్లేదు. చిన్న చిన్న వాటికి “thanks” చెప్పటం మన ఆచారమూ కాదు, అలవాటు అంతకంటే కాదు. కానీ, “చచ్చి నీ కడుపునపుడతా”, “నీ రుణం ఉంచుకోను” లాంటివి చాలానే వున్నాయి. కానీ ఈ “thanks” మనది కాదనేది నా గట్టి ఫీలింగ్. నేను “thanks” చెప్పొద్దనట్లేదు. దాన్ని “thanks” గానే వుంచితే ఏంపొయ్యింది, మనది కాని భావాన్ని తెనుగించడం అవసరమా అని (అందులో మరీ ఇంత దారుణంగా)?

ఒక సర్వసాధారణమైన వ్యవహారాన్నే తీసుకుందాం. మీరు పరధ్యానంగా ఎదురుగా వస్తున్న వ్యక్తిని గుద్దేశారు అనుకుందాం. మన ఊళ్ళో అయితే “చూళ్ళేదండీ” అంటాం. అదే ఆఫీసులో అయితే “సారీ” అంటాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనం వాడుతున్న పదాలే కాదు వ్యక్తం చేస్తున్న భావాలు కూడా వేరు. ఒకచోట “explanation” ఇస్తున్నాం. ఇంకో చోటేమో అటువంటిదిలేదు. ఇంత అతిసాధారణ విషయానికే భావం తేడా, expression తేడా వుంటుంటే రెండు భాషల మధ్య ప్రతీ పదానికీ “వ్యావహారిక సమానార్థమయిన పదం” ఉండాలనుకోవటం అమాయకత్వం అని నా అభిప్రాయం.

ఇంతకీ ఢక్కామొక్కీల గురించి చెప్పలేదుకదూ…
అనగనగా ఒక తరగతి గది. పంతులుగారు పిల్లలకి ఒక్కొక్కళ్ళ పేర్లు పిలిచి వాళ్ళ ఆన్సరు పేపర్లు ఇస్తున్నారు.
“రాజూ…”
“సరితా…”
“రమణా…”
సెవెన్ హిల్స్…”
“…”
“…”
“…”
సూది పడ్డా వినిపించేత నిశ్శబ్దం. మరందుకే మక్కికి మక్కీ తర్జుమా చెయ్యొద్దనేది.

ఇంత చెప్పినందుకు మీరు నాకు “నెనర్లు” చెబితే, నేను చెయ్యగలిగిందేమీ లేదు. “మీకు స్వాగతం” అనడం కంటే”.

ప్రకటనలు

23 వ్యాఖ్యలు »

 1. నెనర్లు… 🙂

  నాకైతే నెనర్లు చాలా తేలికగా, క్లుప్తంగా చెప్పగలిగేదిగా, మనకి అలవాటైపోయిన “థాంక్స్” కి బదులుగా చక్కగా వాడుకోవచ్చు అనిపిస్తుంది….

  వ్యాఖ్య ద్వారా ఏకాంతపు దిలీప్ — ఆగస్ట్ 14, 2008 @ 6:00 సా. | స్పందించండి

 2. నేను కూడా ఎప్పుడూ, ఎక్కడా వినని పదం ఈ ‘నెనర్లు ‘.

  బ్లాగు లోకం లో పడ్డాకే చూశాను ఈ పదాన్ని అందరూ ఎడా పెడా వాడెయ్యటం. తెలుగుతనంతో thanks కు బదులుగా ధన్యవాదాలు మరీ పొడుగైందనో లేక ఎబ్బెట్టుగా ఉందనో తెలీదు కాని అందరూ ఈ ‘నెనర్లు ‘ నే వాడేస్తున్నారు. నేను ఈ వాడుకకు వ్యతిరేకం కాదు కానీ, కొత్తగా మాత్రం ఉంటుంది చూసినప్పుడల్లా..

  🙂

  వ్యాఖ్య ద్వారా Venu — ఆగస్ట్ 14, 2008 @ 7:36 సా. | స్పందించండి

 3. క్రొత్తగా ప్రవేశించిన నాకేనేమోననుకున్నా,పాతవారయిన(అంటే బ్లాగులోకానికి) మీకు కూడానా !

  వ్యాఖ్య ద్వారా chilamakuru vijayamohan — ఆగస్ట్ 14, 2008 @ 8:20 సా. | స్పందించండి

 4. ఆవును, నాకు కూడా ఈ పదం ఎబ్బెట్టుగానే ఉంటుంది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే వంటిమీద గొంగళీలు ప్రాకుతున్నట్టుంటుంది, ఈ పదం విన్నప్పుడల్లా 😉

  ధన్యవాదాలతో,
  సూర్యుడు 🙂

  వ్యాఖ్య ద్వారా సూర్యుడు — ఆగస్ట్ 15, 2008 @ 1:03 ఉద. | స్పందించండి

 5. వేణుగారన్నట్టు ‘ధన్యవాదాలు, కృతజ్ఞతలు’ మరీ పొడుగైన గ్రాంధికమైపోయిందని, ‘థాంక్స్’ మనది కాకుండాపోయిందని, ప్రేమపూర్వక కృతజ్ఞతకు సమానార్థకంగా ‘నెనరు’ ప్రవేశించింది. అందరికీ నచ్చినట్టుంది. లేకపోతే నిలబడేది కాదు. కొత్తొక వింత కదా, (వింత కాదు రోత అంటారా?) అదీ పాతబడిపోతుందిలెండి. 🙂 నిజానికి ఈ పదానికి నేను కూడా పెద్ద మద్దతుదారునేమీ కాను గానీ పాతబడిన తెలుగుపదాలు వాడుకలోకి రావాలనేదే నా కోరిక. అనివార్యంగా అనేక ఆంగ్ల పదాలు తెలుగులోకి వచ్చేస్తున్నాయి. వచ్చేస్తూ తెలుగులో వున్న పదాలను తుడిచేస్తున్నాయి. ఉదాహరణకు “టైమెంత? వాచీ బాగుంది, రేటెంత?”. సమయం అనకపోయినా, గంటెంతయింది అని అడిగేవారుండేవారు, గడియారం, వెల, ఖరీదు లాంటి మాటలు మరుగైపోతున్నాయి. అలా ఒక పక్క పోతూ వుండగానే, “తెలుగులో ఒకాబులరీ చాలా తక్కువ” అనే మాట వినబడుతూ వుంది.

  ఇంగ్లీషు తనలోకి ఇతరభాషల పదాలను అలవోకగా తీసుకుంటుంది కనుక దాని పదసంపద వేగంగా పెరుగుతోందనేది ఒక అభిప్రాయం. తెలుగులోకి ఇబ్బడిముబ్బడిగా ఇంగ్లీషుపదాలొచ్చేశాయి. కానీ అలా వచ్చిచేరిన పదాలు అంత సులభంగా తెలుగు పదాలుగా గుర్తించబడటం లేదే! పండిట్, గురు లాంటి పదాలు ఇంగ్లీషుపదాలైపోయాయి. వాటికి నిఘంటువుల్లో చోటు దొరుకుతోంది. అందుచేత మరికొన్నాళ్లకు ఈ పండిట్, గురు అనేవి సంస్కృతపదాలైనా కాపోయినా ఆంగ్లపదాలు మాత్రం అయిపోతాయనుకుంటాను. ఇలా కావడానికి ఇతర కారణాలెలావున్నా ఆ పదాలు నిఘంటువుల్లో చేరి, వెతికినవారికి దాని అర్థమూ వాడుకా దొరుకుతుండటం ప్రధాన కారణమని నాకనిపిస్తుంది. ఎందుకంటే ఒక కొత్తపదాన్ని చూసిన వాడు ముందు వెతికేది నిఘంటువే కదా. ‘ఓహో! ఈరోజు నాకొక కొత్తపదం తెలిసింది’ అనుకుంటాడు, ఆ పదాన్ని తానూ వాడడం మొదలెడతాడు. తెలుగులో మనకు పాత నిఘంటువులే ఆధారం. వాటిలోకి కొత్తపదాల చేరికకు అవకాశం ఎక్కడుంది? బహుశా తెలుగు వికీపీడియా నిఘంటువేమయినా ఈ పని చేయగలదేమో! నేనిలా మాట్లాడుతూ మాట్లాడుతూ దారి తప్పే లోపు ఒక మాట చెప్పి వూరుకుంటాను. తెలుగులో ఒక కొత్త భావానికి కొత్త పదాన్ని వాడే ముందు – ఆ భావానికి దగ్గరగా ఏదైనా పాత తెలుగు పదం వుందేమో చూసి, వాడుకలో పెట్టి, ఎబ్బెట్టు అనుకోకుండా మొహమాటం లేకుండా కొంతకాలం వాడి చూడాలని నా అభిప్రాయం.

  నెనరు అనే మాటకు ప్రేమ పూర్వక కృతజ్ఞత అనే అర్థం తెవికీ నిఘంటువులో మీకు కనబడితే నన్ను కోపంగా చూడకండి. 😉

  — రానారె

  వ్యాఖ్య ద్వారా రానారె — ఆగస్ట్ 15, 2008 @ 2:21 ఉద. | స్పందించండి

 6. మీ అబిప్రాయంతో నేనెంతవరకూ ఏకీభవిస్తానో తెలియదుగానీ మీ టపా బావుంది.అలానే రానారె గారి వివరణా బావుంది.

  తెలుగు బ్లాగర్లలో ఎక్కువమందికి మాతృభాషాభిమానం మెండు.దీనితో అనేక ఆంగ్ల సాంకేతిక పదాలకు తెలుగులో సమానార్థకాలు కనుగొనే ప్రయత్నం జరిగినది… జరుగుతున్నది.అలానే ఒకనాడు వాడుకలో ఉండి ఇప్పుడు వాడుకలో లేకుండా పోయిన తెలుగుపదాలు కూడా కొన్ని సూచించబడ్డాయి.’నెనర్లు ‘ అనే పదం అటువంటి పాతపదమే.చాలా మంది బ్లాగర్లు ఆ పదం వాడుతున్నారు.

  దీనివలన మన తెలుగు భాష ఆంగ్లాన్ని అధిగమించాలనే ఉద్దేశం కాదుగానీ మన భాషాభిమానం కొద్దీ మనం ఇలా చేస్తున్నాము. కానీయండి.. తెలుగు భాషమీద అభిమానం తెలుగు వారుకాక మరెవరు చూయిస్తారు. ఎన్ని అరవ, పారశీక, ఉర్దూ, ఆంగ్ల పదాలను మనం ఆదరించలేదు.అలానే మనదే అయిన ఈ పాత పదాన్ని మనం ఆదరించలేమా?

  అయితే ఈ పదం కాలక్రమంలో బ్లాగ్లోకపు పరిధిని దాటుతుందా లేక ఇక్కడికే పరిమితమౌతుందా లేక ఇక్కడ కూడ క్రమంగా కనుమరుగౌతుందా అనేది కాలమే చెప్పాలి!

  వ్యాఖ్య ద్వారా Saraswathi Kumar — ఆగస్ట్ 15, 2008 @ 6:51 ఉద. | స్పందించండి

 7. చర్చ చాలా బగుంది. ఇటువటి పనికి వచె చర్చలు మరిన్ని రావాలి.
  ఇక నెసర్లు విషయానికి వస్తె అది నాకు కూడా కొత్తగా ఉంది.
  మన బ్లాగ్లొకొం స్రుస్టించిన కొత్త పదం.

  బాగునా లెకపొయినా బ్లాగుని ప్రొత్సహించటం లొ బాగం గా వాళ్ళ ప్రయత్నాని అబినందిదాం అని నా కనిపిస్తుంది

  వ్యాఖ్య ద్వారా Ghanta Siva Rajesh — ఆగస్ట్ 15, 2008 @ 7:38 ఉద. | స్పందించండి

 8. raanaare@ ठीक बोला

  వ్యాఖ్య ద్వారా cbrao — ఆగస్ట్ 15, 2008 @ 12:47 సా. | స్పందించండి

 9. నేనూ చాలా కాలంగా ఇబ్బంది పడ్డాను. చాలామంది బ్లాగర్లని అర్ధాన్ని అడిగా. అందరూ మాకూ కొత్తే బ్లాగులోనే వినటం అన్నారు. నేను మాత్రం సాధ్యమయిన వరకు ధన్యవాదాలు అనే వాడుతున్నా.

  వ్యాఖ్య ద్వారా Naga Muralidhar Namala — ఆగస్ట్ 16, 2008 @ 12:03 ఉద. | స్పందించండి

 10. మిగతా పదాలకన్నా ఈ పదాన్ని టైప్ చెయ్యడం సులువు. అందుకే చాలా కన్వీనియంట్ గా వాడేస్తున్నాను. ఎలాగూ బ్లాగుప్రపంచంలో అందరికీ అర్థమయ్యే పదమేగా!

  వ్యాఖ్య ద్వారా కె.మహేష్ కుమార్ — ఆగస్ట్ 16, 2008 @ 1:43 సా. | స్పందించండి

 11. వ్యాఖ్యానించిన వారందరికి కృతజ్ఞతలు. తెలుగు బ్లాగు లోకంలో దాదాపు అందరూ “open mindset” వున్న వారే. చరసాల, రానారె, కత్తి మహేష్… వంటివారు ఏమి చెప్పినా ఒక పధ్ధతిగా, చదవ బుద్ధయ్యేట్టుగా వుంటుంది.

  @రానారె — మీ వివరణ బాగుంది. “తెలుగు పదం” వంటి రెండు మూడు తెలుగు గూగులు గ్రూపులలో చూశానండి. ఇది తెలుగు అనే నమ్మకం కుదిరింది కానీ, ఇది “thanks” కి “సమానార్థ తెలుగు పదం” అనే నమ్మకం కుదరలేదు. నా వాదన యేమిటంటే, పోస్టులో చెప్పినట్టు ఇది తెలుగు వాళ్ళ “ఫీలింగ్” కాదు. నేను మాత్రం ఇంకా కృతజ్ఞతలు/thanks వాడడానికే నిర్ణయించుకున్నాను.

  —శ్రవణ్

  వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — ఆగస్ట్ 18, 2008 @ 6:32 సా. | స్పందించండి

 12. అన్నా! ఒక మంచి పదంకు ఇంత లొల్లి పెట్టుడెందుకే? ఎవ్వలు కనిపెట్టకుంటె కొత్త పదాలు ఎట్ల పుట్టాలె?

  వ్యాఖ్య ద్వారా తెలుగు అభిమాని — ఆగస్ట్ 22, 2008 @ 1:15 సా. | స్పందించండి

 13. మనం వాడుతున్న పదాలన్నీ ఇదివఱకు తెలుగులో ప్రాచుర్యం వహించినవి కావు. ఎక్కువ భాగం పునరుద్ధరించబడినవి మాత్రమే. “నెనర్లు” కూడా అలా పునరుద్ధరించబడిన పదమే. కొత్తగా ఎవరూ కల్పించినది కాదు. ఒకే వ్యక్తీకరణకు భాషలో రెండుమూడు ప్రత్యామ్నాయ పదాలు అందుబాటులో ఉండడం మంచి విషయమే. నెనర్లయినా, ధన్యవాదాలైనా, కృతజ్ఞతలైనా మఱొకటైనా ఎవరి ఇష్టానిష్టాల్ని బట్టి వారు వాడుతున్నదే.. ఇదే వాడాలని ఎవరూ ఎవరినీ నిర్బంధించడంలేదు కదా ! మన జాతికి చెందిన ఒక అమాయక అచ్చ తెలుగు పదాన్ని ఇంత ద్వేషపూరిత, పరుష, కర్కశ పదజాలంతో మీరు attack చెయ్యడం చాలా బాధ కలిగించింది.

  ఇహపోతే నెనర్లు Thanks సమానార్థకమవునా ? కాదా ? అనే చర్చ అప్రస్తుతం. విదేశీ వాడుకలకు సమీపార్థాన్నిచ్చే దేశీయ వాడుకల్ని విఱివిగా వాడడం ఏ భాషలోనైనా, ఏ జాతిలోనైనా ఉంది.

  ఏమీ అనుకోకపోతే, ఇంతకీ మీ వయసెంత ? తెలుసుకోవచ్చునా ? .

  వ్యాఖ్య ద్వారా తాడేపల్లి — ఆగస్ట్ 31, 2008 @ 10:48 సా. | స్పందించండి

 14. “ద్వేషపూరిత, పరుష, కర్కశ”

  తాడేపల్లి గారూ 🙂

  అటువంటిదేమీ లేదండీ బాబూ. మీకెందుకలా అనిపించింది? అయినా ఒక పదమ్మీద ద్వేషమెందుకండీ, అందులో తెలుగు పదమ్మీద.

  వ్యాఖ్య ద్వారా శ్రవణ్ — సెప్టెంబర్ 1, 2008 @ 3:17 సా. | స్పందించండి

 15. నేను పొఱపడితే క్షమించగలరు. ఏదో బాధలో అలా రాశాను. నాకు సంస్కృతం కంటే తెలుగే ఎక్కువ ఇష్టం.

  వ్యాఖ్య ద్వారా తాడేపల్లి — సెప్టెంబర్ 1, 2008 @ 5:41 సా. | స్పందించండి

 16. ఈ నెనర్ల గురించి నాకు తోచిన రెండు(అహా, నాలుగు) ముక్కలు:
  ఈ పదం కొంతమందికి నచ్చకపోవడానికి ఒక కారణం అది దేశ్య పదం (ద్రవిడభాషలోంచి వచ్చింది) కావడం అనుకుంటాను. సంస్కృత పదాలూ, వాటి నుంచి వచ్చిన పదాలూ ఎక్కువ అలవాటైపోయి చాలామందికి దేశ్యపదాలు కొంచెం వెగటుగా తోస్తాయి.
  మరో కారణం దీని అర్థం కావచ్చు. ఈ పదానికి కృతజ్ఞత అన్న అర్థం ఉన్నా, ఎక్కువగా ప్రేమ ఆప్యాయత అన్న అర్థాల్లోనే పూర్వంవాళ్ళు వాడినట్టున్నారు. అంచేత అలాటి సున్నితమైన పదాన్ని (నెనరుకి బహువచనం నెనర్లు అన్నది మనమిప్పుడు కల్పించినదేనేమో!) ఇలా నలగ్గొట్టెయ్యడం కొంతమందికి నచ్చదేమో!
  ఇక దీని అవసరం గురించి. శ్రవణ్ గారు చెప్పినట్ట్లు thanks అన్న పదానికి సమానార్థక పదం నిజానికి మన తెలుగులో లేదు, ఉండలేదు. ఎందుకంటే అలాటిది చెప్పడం మన ఆచారంలో ఉండేదికాదు. ఈ కృతజ్ఞతలు, ధన్యవాదాలు అన్న పదాలు కూడా మనకి ఆధునికంగా ఉపయోగంలోకి వచ్చినవే. ఇంగ్లీషువాళ్ళకి formality ఎక్కువ కాబట్టి వాళ్ళ ఉత్తరాల్లోనూ ఇతరాత్రా formal communication లోనూ వాడే ఈ పదానికి తెలుగు అనువాదంగా ఈ కృతజ్ఞతలూ ధన్యవాదాలూ వచ్చినట్టున్నాయి. అయితే వీటికున్న ఇబ్బందల్లా, ఇవి too formal. రాసే భాషలో ఇవి ఎబ్బెట్టుగా ఉండవు కానీ నిత్యం మాట్లాడే భాషలో ఇవి ఎబ్బెట్టుగా ఉంటాయి. కానీ thanks అన్న పదం ఇప్పుడు మన నిత్యవ్యవహారంలో భాగమైపోయింది. ఇలాటి సందర్భాలలో కృతజ్ఞతలు, ధన్యవాదాలు వాడలేం. మరెలా? ఇంగ్లీషు మాట thanksనే వాడాలా?
  ఈ ఖాళీని “నెనరు” పూరిస్తున్నట్టుగా ఉంది. ఇది అచ్చతెలుగు పదం కాబట్టి formalగా అనిపించదు. కాబట్టి నిత్య వ్యవహారానికి పనికొస్తుంది.
  ఇంత ఆలోచించి ఎవరూ ఏ పదాన్ని వాడరు. నచ్చితే వాడతారు లేదంటే లేదు. నేనూ ఈ పదం నచ్చే దాన్ని వాడుతున్నాను. అయితే వాడటంలోని ఔచిత్యాన్ని గురించి మీరు చర్చలేవదీసారు కాబట్టి నాకు తోచిన విషయాలిక్కడ పంచుకున్నాను.

  వ్యాఖ్య ద్వారా కామేశ్వర రావు — సెప్టెంబర్ 2, 2008 @ 6:15 సా. | స్పందించండి

 17. నెనర్లండి, చాల బాగ రాశారు. నాకైతె నెనర్లు బాగానె వుంది

  వ్యాఖ్య ద్వారా M.Srinivas Gupta — మార్చి 11, 2009 @ 11:33 ఉద. | స్పందించండి

 18. నేను బ్లాగు లోకంలోకి వచ్చి ఒక నెలే అయ్యింది.
  అందుకేనేమో ఈ పదం నాకింకా అలవాటు కాలేదు.
  నాకైతే ‘నెనరు ‘ కాస్త ఎబ్బెట్టుగానే ఉంది.

  వ్యాఖ్య ద్వారా bonagiri — మార్చి 11, 2009 @ 3:48 సా. | స్పందించండి

 19. నేను ఇక్కడకు ఎందుకొచ్చానంటే…ఎక్కడో ఏదో వెతుకుతూ ఏదో ఒక తెలుగు బ్లాగులో ఒక చర్చ చదువుతూంటే అక్కడ ఎవరో నెనర్లు అర్పించారు. నాకేమో బొత్తిగా అర్ధంకాలేదు….నెట్‌లో ఏంచేస్తాం? వెంటనే గూగులుతాం కదా… అదే చేశా.. ఇదిగో ఇక్కడ తేలాను. చాలానే చర్చ జరిగిందని చూస్తున్నాను.
  కరక్టే, నెనర్లు ఎబ్బెట్టుగానే వుంది. దేశ్య పదం కావడం వల్లా? అయ్యుండచ్చు, కాక పోవచ్చు..కానీ ఆ యాంగిల్లో ఆలోచన బాగానే వుంది.

  మరి ఎందుకు వాడకం మొదలైంది అంటే ప్రతి ఇంగ్లీషు పదానికి సమానంగా తెలుగు ఉండితీరాలని కదా మన ఆవేశమంతా…అందుకని! “అంతర్జాలం” అనే పదం కనిబెట్టినవాళ్ళని అడగాలి. (అంతర్జాతీయం – International) సో, inter = అంతర్ ; Net = వల, జాలం. ఇవి కలిపి “అంతర్జాలం” చేశారని నా ఉద్దేశ్యం (Internet is not this….its is a network of computers…that is, a large number of interconnected computers forming a network…and Web is interconnected content places(websites) that can be browsed using HTTP )మరి అంతర్జాలంతో ఈ రెండు అర్ధాలు స్పురిస్తాయా? లేదని నా ఉద్దేశ్యం. కానీ వాళ్ళు కనుకున్నారు. నేను ఆనాటికి పిక్చర్లో లేను కాబట్టి, “నువ్వేంటి ఈరోజు చెప్పేది బోడి!” అని కొట్టిపారేస్తున్నారు. శుభం!

  ఈ నెనర్ల గోలలో పడి అసలు పని చంకనాకి పోయింది…అర్ధంగాని పాత పదం ఎవడు వాడమన్నాట్టా? వాడితే వాడాడు, నాకు బుద్దిలేక ఎందుకు చదవాలిటా? ఇకాడకొచ్చి పదం గురించి ఆలోచించి, చదివి, కోపపడి, ఆవేశపడి అరిచి గీ పెట్టి ఇంత ఎందుకు కొట్టాలిటా? అంతా ఖర్మ బాబు, ఖర్మ(మళ్ళా కరెక్షన్ చెప్పకండి…అసలే మంటగా వుంది…ఆ నెక్సియం ఎక్కడ చచ్చిందో… కర్మ బాబు కర్మ…)… నే బోతున్నా.. మళ్ళా ఏదో ఒకరోజు మళ్ళా ఏదో ఒక బొనర్లు/గీనర్ల గోలలో కలుసుకుందాం…

  ఎదవ సంత ఎదవ సంతనీ….ఏం చేస్తున్నాను నేనూ…. ఆ ….అది కదూ!…రైట్

  వ్యాఖ్య ద్వారా దారిన పోయే దానయ్య — మార్చి 13, 2009 @ 12:23 ఉద. | స్పందించండి

 20. nenu indhulo ravatam ide modhati saari… naaku telugu typu(mudrimchatamu)raadu. kanuka ilaa… rastunnaanu. naaku telisi… tamilamlo thanks ku badulugaa… vaari bhashalo NANDRI ani antaaru… bahusa mana teeyani telugulo NENARU ante inkaa baaguntundhi gaa…..

  వ్యాఖ్య ద్వారా balasubramanyam — మార్చి 26, 2009 @ 3:36 సా. | స్పందించండి

 21. hi ramesh

  వ్యాఖ్య ద్వారా ramesh — జూన్ 9, 2009 @ 3:25 సా. | స్పందించండి

 22. Tadepally garu / ALL,
  Everybody is saying that this is old word, but can anybody give some references where this word is used?
  (I am just asking out of curiosity to know more about this word, the word is very good).

  వ్యాఖ్య ద్వారా Reddy — డిసెంబర్ 7, 2010 @ 6:14 సా. | స్పందించండి

 23. పైచర్చలన్నీ మొదలై చాన్నాళ్ళయినట్లుంది. ఇంతకుముందే ఏదో అరవ బ్లాగు చూస్తుంటే చటుక్కున గుర్తొచ్చింది. అరవంలో thanks కి నన్రి (நன்றி) అంటారు. నన్రి, నెనరు ఈరెండూ ఒకేమూలంనుండి వచ్చాయని నాఅభిప్రాయం (అంటే నాదగ్గర ఆధారాలేం లేవు). అరవంలో నన్రి కూడా మన నెనర్ల లాగ నిన్నమొన్న జాలం మహిమతో బయట పడ్డ పదం కాదనిపిస్తోంది. నాచిన్నప్పట్నుంచి వింటూనే ఉన్నా ఆమాట. ఇంకెవరన్నా ద్రవిడభాషలపై పట్టున్నవారు వ్యాఖ్యానిస్తే నెనరులు.

  వ్యాఖ్య ద్వారా నాగేస్రావ్ — ఫిబ్రవరి 16, 2011 @ 11:11 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: