దిల్ సే …

ఏప్రిల్ 22, 2008

తెల్లకాగితం

అనగనగా ఒక రోజు…
స్థలం: జిల్లా కేంద్ర గ్రంధాలయం
ఎప్పట్లాగే జనాలు నిశ్శబ్దంగా చదువుకుంటున్నారు. ఒక పిల్లాడు ఆత్రుతగా ఎదో పేపర్ని తిరగేస్తున్నాడు. ఆరోజు EAMCET రిజల్సు వచ్చే రోజు. తన నంబర్ కనిపించటంతో ఎగిరి గంతేశాడు. ‘హుర్రే’ అని అరుద్దామంటే అదేమో గ్రంధాలయం. సంతొషంగా బయటకొస్తుంటే బయట అప్పటికే చర్చిస్తూ జనాలు. పరిచయమున్న మొహాలు.
“అన్నా, నాకు EAMCET ర్యాంకొచ్చింది”
వాడి అనందానికి అవధుల్లేవు.
అన్నా అని పిలిపించుకున్న పెద్దాయన కూడా సంతోషించాడు. “EAMCET ర్యాంకు వస్తే ఏంటి? తర్వాత ఏమి చేస్తావు? ఉద్యోగం వెతుక్కోవాలిగా… ఎందుకు ఇంజినీరింగ్? బుద్ధిగా డిగ్రీ చేస్తూ కాంపిటిటివ్ పరీక్షలు రాస్కో…ఆ డిగ్రీ అయిపోయే లోపు నీకు ఏదో ఒక ఉద్యోగం రాకపోదు” సలహా ఇచ్చాడు తన నాలెడ్జీనంతా రంగరించి.

అదే రోజు సాయంత్రం…
స్థలం: పిల్లాడి సొంత వూరి రచ్చబండ
పిల్లాడూ, వాళ్ళ అయ్యా మాట్లాడుకుంటున్నారు. పరీక్షయితే రాశాడు, మంచి ర్యాంకే వచ్చింది. తర్వాత ఏంటి? తండ్రికి ఎన్నాళ్ళు భారంగా వుండటం? EAMCET రాస్తే ఇంజినీరింగ్ చదవాలని తెలుసు. ఇంజినీరింగ్ అంటే మంచి చదువని మాత్రం తెలుసు, అదేంటో తెలియదు. మరి అది కూడు పెడుతుందా? సుబ్బరంగా ఆ అన్న చెప్పినట్టు ఏదయినా చిన్న ఉద్యోగం చేస్తూ, కాంపిటిటివ్ ఎగ్జాంసు రాసుకుంటే వుజ్జోగం వచ్చినప్పటికే వస్తుంది. ఇంతలోపు తండ్రికి సాయంగా ఉండొచ్చని నిర్ణయించుకున్నాడు. దారినపోయే కాపు ఒకాయన వీళ్ళ మాటలు విన్నాడు. “యేందీ, మీవోడికి ర్యాంకు వొచ్చిందంటగా మావోడి కంటే బాగెట్టొచిందీ ఏదొ కంపూటర్ తప్పయుంటది ఇంగోసారి సూస్కోండి” దబాయించి మరీ చెప్పాడు. ఈరోజుల్లో బియ్యే.బియ్యీడీ జేసినా మాఅల్లుడికే ఉజ్జోగాల్లేవు మీవోణ్ణి యేంజేద్దామనేంది? వాళ్ళయ్యకి కాపు చెప్పిందాంట్లో నిజం లేకపోలేదనిపించింది. పిల్లాడు డిగ్రీ చేద్దామని నిర్ణయానికొచ్చాడు.

పేపర్ కట్టింగుని ట్రంకుపెట్టెలో భద్రంగా దాచిపెడుతుంటే… పక్కనే తెల్లకాగితం….తను జీవితంలో ఒకేఒక్కసారి ఫెయిల్ అయిన పరీక్షది. టీచర్ పిలిచి ఎందుకు రాయలేదని అడిగిన సంగతీ… తను నెలరోజులు కూలికెళ్ళిన సంగతీ… చేతులు బొబ్బలు కట్టి పరీక్ష రాయలేకపోయిన సంగతీ… ఒక్కొక్కటే గుర్తుకొచ్చాయి. టీచరు ఎంత మంచిది. ఎన్ని మంచి మాటలు చెప్పింది. తను బాగా చదువుకుని పెద్దవాడవ్వాలని ఎన్ని చెప్పింది. ఎంత ప్రోత్సహించింది.
“ఒకసారి టీచర్ని కలిస్తే …”
అనుకున్నదే తడవుగా అయ్యని బయల్దేరదీశాడు. టీచర్ని వూరు మార్చారుగా, ఆవూరికి.

8 ఏళ్ళ తర్వాత…
అదే రోజు సాయంత్రం…
స్థలం: అదే రచ్చబండ
ఆ వూరినించి ఇప్పుడు 5గురు ఇంజనీర్లు, 2 డాక్టర్లు, ఒక సర్పంచ్ అంతా కుర్రాళ్ళే. వూరికి కరెంటు తెచ్చారు. ఇప్పుడు పెద్ద స్కూలు గురించీ, ఇన్‌స్పిరేషనూ, ఇన్‌ఫర్మేషనూ  తేవడం గురించీ చర్చిస్తున్నారు.

ప్రకటనలు

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.