దిల్ సే …

ఆగస్ట్ 14, 2008

తెలుగు భాషలో నాకు నచ్చని ఒకేఒక్క పదం — “నెనర్లు”

ఏదో టైటిలు బాగుందని అట్టా అన్నాను గానీ “నెనర్లు” ఒక తెలుగు పదముందంటే నాకింకా నమ్మబుద్ధి కావట్లేదు. నాకు తెలియని బోల్డు తెలుగు పదాలుండొచ్చు, నేను కాదనను. ఈ పదాన్ని దాదాపు ఏడాది నించీ వింటున్నా… ప్చ్… అబ్బే… ఉపయోగించటం సంగతి అటుంచి ఎవరైనా వాడితే అదెంటో ఎబ్బెట్టుగా ఉంటుంది.

ఇది మరీ బావుంది, నువ్వెవరూ ఏది తెలుగో ఏది కాదో నిర్ణయించడానికంటారా… మీరక్కడే తప్పులో కాలేశారు. నేను అది తెలుగు కాదనటంలా. దీన్ని వాడ్డం కాదు కదా వినడానికి కూడా (నాకు) (కష్టంగా ఉంది) ఇష్టంగా లేదు అంటున్నా. ఎంటీ? ఎందుకు? అంటారా… అదో అక్కడికే వస్తున్నా. ఎందుకో తెలీదు ఇది విన్నప్పుడల్లా ఇది అరవ పదానికీ ఇంగ్లీషు ఫీలింగుకీ పుట్టిన మళయాలీ పిల్లపదాన్ని అరబ్బీ వాడినట్టుంటుంది. ఎందుకుంటుందీ అంటే నాదగ్గర సమాధానం లేదు. బహుశా నేను జీవితంలో తిన్న కొన్ని ఢక్కా మొక్కీ లనుకుంటా.

భాష భావాన్ని తెలపడానికి మాత్రమేపుట్టింది అనేది నా ఫీలింగ్. భావాలు ఆచారవ్యవహారాల నించీ, కష్ట నష్టాల నించీ వస్తాయనేది నిర్వివాదాంశం. భావం ఒకటే అయినా దాన్ని వ్యక్తంచేసే తీరు దేశాన్ని బట్టీ ప్రదేశాన్ని బట్టీ మారుతుంటుంది, ఇక పదాల సంగతి చెప్పఖ్ఖర్లేదు. చిన్న చిన్న వాటికి “thanks” చెప్పటం మన ఆచారమూ కాదు, అలవాటు అంతకంటే కాదు. కానీ, “చచ్చి నీ కడుపునపుడతా”, “నీ రుణం ఉంచుకోను” లాంటివి చాలానే వున్నాయి. కానీ ఈ “thanks” మనది కాదనేది నా గట్టి ఫీలింగ్. నేను “thanks” చెప్పొద్దనట్లేదు. దాన్ని “thanks” గానే వుంచితే ఏంపొయ్యింది, మనది కాని భావాన్ని తెనుగించడం అవసరమా అని (అందులో మరీ ఇంత దారుణంగా)?

ఒక సర్వసాధారణమైన వ్యవహారాన్నే తీసుకుందాం. మీరు పరధ్యానంగా ఎదురుగా వస్తున్న వ్యక్తిని గుద్దేశారు అనుకుందాం. మన ఊళ్ళో అయితే “చూళ్ళేదండీ” అంటాం. అదే ఆఫీసులో అయితే “సారీ” అంటాం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మనం వాడుతున్న పదాలే కాదు వ్యక్తం చేస్తున్న భావాలు కూడా వేరు. ఒకచోట “explanation” ఇస్తున్నాం. ఇంకో చోటేమో అటువంటిదిలేదు. ఇంత అతిసాధారణ విషయానికే భావం తేడా, expression తేడా వుంటుంటే రెండు భాషల మధ్య ప్రతీ పదానికీ “వ్యావహారిక సమానార్థమయిన పదం” ఉండాలనుకోవటం అమాయకత్వం అని నా అభిప్రాయం.

ఇంతకీ ఢక్కామొక్కీల గురించి చెప్పలేదుకదూ…
అనగనగా ఒక తరగతి గది. పంతులుగారు పిల్లలకి ఒక్కొక్కళ్ళ పేర్లు పిలిచి వాళ్ళ ఆన్సరు పేపర్లు ఇస్తున్నారు.
“రాజూ…”
“సరితా…”
“రమణా…”
సెవెన్ హిల్స్…”
“…”
“…”
“…”
సూది పడ్డా వినిపించేత నిశ్శబ్దం. మరందుకే మక్కికి మక్కీ తర్జుమా చెయ్యొద్దనేది.

ఇంత చెప్పినందుకు మీరు నాకు “నెనర్లు” చెబితే, నేను చెయ్యగలిగిందేమీ లేదు. “మీకు స్వాగతం” అనడం కంటే”.

ప్రకటనలు

మే 8, 2008

మాతృభాష — ఒక భేతాళప్రశ్న

Filed under: సరదాకి — శ్రవణ్ @ 1:42 సా.
Tags: , , ,

భేతాళప్రశ్నలు అంటే ఏదో ఒక వింత situation ఇచ్చి  “రాజా, ఇప్ప్పుడు చెప్పు” అని భేతాళుడు విక్రమార్కుణ్ణి అడుగుతాడు. ఆ situation ఏమో సామాన్యంగా జరగడానికి వీల్లేకుండా ఉంటుంది. కాని ఇది నిజంగా జరిగింది.

నా మితృడొకతను. ఇతనిది చిత్తూరు. వీళ్ళ నాన్నగారు తెలుగు వారు, చక్కగా తెలుగు మాట్లాడతారు. పెళ్ళిమాత్రం తెలుగు ఏమాత్రం రాని తమిళుల ఇంట్లో చేసుకున్నారు (arranged marriage, same caste). పెళ్ళయ్యాక ఆవిడ చక్కగా తెలుగు నేర్చుకుంది. ఇంట్లో అందరూ తెలుగులోనే మాట్లాడతారు. ఉద్యోగం బెంగళూరులో. వీళ్ళ బంధువులు చాలామంది అక్కడ సెటిల్ అయ్యారు. నామిత్రుడు అక్కడే పుట్టిపెరిగాడు.

కాబట్టి ఇతను తెలుగూ, ఇంగ్లీషూ, హిందీ, అరవం మరియూ కన్నడ చక్కగా మాట్లాడతాడు. తనకి spontanious గా వచ్చే భాష కన్నడ. ఇంట్లో తెలుగు మాట్లాడతారు. తన తల్లిగారు అరవ వారు. పనిచేసేది విదేశంలో కాబట్టి ఎక్కువ మాట్లాదేది ఇంగ్లీషు. అతన్ని అడిగితే నేను తెలుగు వాణ్ణి, బెంగళూరులో పెరిగాను అని చెబుతాడు.

పాఠకరాజా  ఇప్పుడు చెప్పు. ఇతని మాతృభాష ఏమిటి? సమాధానం తెలిసీ చెప్పకపోయావో నీతల వెయ్యి వ్రక్కలగుగాక!

ఏప్రిల్ 16, 2008

చిరంజీవి రాజకీయాల్లోకి రావాలా?

ప్రత్యేకించి చిరంజీవి, సినిమావాళ్ళు అని కాదు గాని, రావాలండీ బాబూ! ఎక్కడెక్కడ ఈజీమనీ ఉందో, అక్కడక్కడ ఉన్నవాళ్ళంతా రాజకీయాల్లోకి తొందరగా రావాలి. అంటే వీళ్ళంతా సులభంగా సంపాదించేశారని కాదు గానీ. ఏదో ఒక మతలబు చెయ్యకుండా సంపాదించరు కదా ‘ఈజీమనీ’ ని.
రాజకీయాల తర్వాత అంతటి రాజకీయాలుండేది మన సినిమాల్లోనే అంటారు కదా! నాకు తెలిసినంతలో ఈ విషయాలు పేపరువాళ్ళదాకా వచ్చి వేర్వేరు కారణాల వల్ల ఆగిపోతాయి. ఇప్పుడు మన రాజు గారూ, ఇంకా రాజులా ఫీలయ్యే పాత రాజుగారూ, నువ్వు డాష్ అంటే నువ్వే డబుల్ డాష్ అని తిట్టుకుంటున్నారు కదా! జనాలు చూస్తున్నారు. వాళ్ళకి అర్ధమవుతోంది ఎవ్వడు ఏంటి అనేది. చర్చ జరగాలి. ఎవడెలాంటి వాళ్ళన్నది తేలాలి. వీళ్ళు చేసిన మతలబులు అన్నీ బయటకి రావాలి. అప్పుడయినా ప్రజల్లో చైతన్యం వస్తుందేమో చూడాలి. దీని ద్వారా జనాలకి అవేర్‌నెస్ పెరుగుతుంది అని అనుకుంటున్నాను. చంద్రబాబు ఫలానా స్కాము చేశాడు అంటే ఫీలవని జనాలు, మన ముఠామేస్త్రి చిరంజీవి… మన బుద్ధిమంతుడు బాలక్రిష్ణ… ఫలానా స్కాము చేశాడు అంటే ముక్కున వేలేసుకోరా? “అవునా, మరి ఫలానా సినిమాలో ఎంత బుద్ధిమంతుడిలా నటించాడు? ఎంత దారుణం” అనుకోరా? అట్లాగయినా చర్చ జనాల్లో జరగదా?
ఇప్పుడు చూడండి, సినిమా ఇండస్ట్రీ 75 ఏళ్ళనించీ వుంది కదా! ప్రజలు దీనిలోని లొసుగుల గురించి, లోగుట్టుల గురించీ పెద్దగా మాట్లాడరు. రేపు అందులోంచి ఒకరిద్దరు పెద్దవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే నాసామిరంగా… ఇక చూడాలి… నువ్వు ఇది అంటే నువ్వు అది అని తిట్టుకోవడం చూస్తేనన్నా వాళ్ళమీద భక్తి తగ్గి మంచి సినిమాలు వస్తాయేమో. ఇప్పటి దాకా దేవుళ్ళతో సమానంగా ఒక వెలుగు వెలిగిన మన హీరోలు రేపు ఒకళ్ళ మీద మరొకరు బురద చల్లుకుంటారా? కార్టూనిస్టులకి బాగా పని ఉంటుందనుకుంటా.
కామిడీ సంగతి తర్వాత ఇందులో ఒక వ్యాపార సూత్రముంది. బీహారూ, యూపీల్లో లాగ అందరూ స్తబ్దుగా ఉంటే వ్యాపారం జరగదు. డబ్బు కదలాలి, అది కదిలే చోటకి ఒక్కళ్ళు కాదు పది మంది వెళ్ళాలి, పోటీ పడాలి. అప్పుడే అన్ని వర్గాలవాళ్ళూ సంతోషంగా ఉంటారు. హైదరాబాదు ఉన్న ఆటోవాళ్ళూ, హోటలువాళ్ళూ గుంటూరు, జగిత్యాల, నంద్యాల లోని ఆటోవాళ్ళూ, హోటలువాళ్ళ కంటే సంతోషంగా ఉండటానికి ఇదేకారణం అని నా అభిప్రాయం.
రాజకీయాలని మన పల్లెటూళ్ళలోకి తెచ్చిన ఘనత రామారావుకి దక్కినట్టే ఇంకోంచెం ఓపెన్ చేసిన ఘనత తర్వాతతరం సినిమావాళ్ళకి దక్కాలని, పనిలో పని సినిమా ఇండస్ట్రీలో హీరోలని ఆరాధించటం పోయి మంచి సినిమాలు రావడానికి దారి సుగమమవ్వాలని అశిద్దాం.

వర్డ్‌ప్రెస్.కామ్‌లో ఓ ఉచిత వెబ్‌సైటు లేదా బ్లాగును సృష్టించుకోండి.