దిల్ సే …

మే 14, 2008

నేనో సగటు భారతీయుణ్ణి, నాకేమీ తెలీదు

నేనో సగటు భారతీయుణ్ణి, నాకేమీ తెలీదు
ఆమధ్య హైదరాబాదులో బాంబ్లాస్టులు అయ్యాయని తెలుసు
ఫ్లయ్యోవరు కూలిందని తెలుసు
పేలాక పేలాయనీ, కూలాక కూలిందనీ తెలుసుగాని
అంతకంటే నాకేమీ తెలియదు
నేనో సగటు భారతీయుణ్ణి, నాకేమీ తెలీదు

-:-:-:-:-:-

పొయినసారి ఎలచ్చన్లొచ్చియి గదా
అన్ని పార్టీలోళ్ళొచిండ్రు, మస్తుగ తాగినం
నిన్న మా భూములు లాక్కున్రు
అళ్ళీళ్ళని కలుపుకొని దర్నాలైతే చేసినం
మా అయ్య ఏడ్చేడ్చి సచ్చిండు
సచ్చినంక సచ్చిండని ఎర్కయింది
గంతకంటే నాకేమెర్కలే
మాదీ గీదేశమే, నాకేమెర్కలే

-:-:-:-:-:-

నేనో సాఫ్టువేర్ ఇంజనీర్ని, నాకేమీ తెలీదు
సమాజం బాగుపడాలని గఠ్ఠిగా అనుకుంటుంటాను
తెలుగు భాష వృద్ధి చెందాలని ఆవేశ పడుతుంటాను
దశాబ్దాలుగా వెధవలు రాజ్యమేలుతున్నారని తెలుసు
ఏదైనా చెయ్యాలని తెలుసు, ఏంచెయ్యాలో తెలీదు
అంతకంటే నాకేమీ తెలీదు
నేనో మధ్యతరగతి భారతీయుణ్ణి,  నాకేం అంతగా తెలీదు

-:-:-:-:-:-

నేనో యన్నారైని, నాకేంపెద్దగా తెలీదు
మొన్న తానా సభలకెళ్ళా
స్కాములు చేస్తున్నారనీ, భూములు దోచుకుంటున్నారనీ తెలుసు
కోటానుకోట్లు అక్రమంగా సంపాదిస్తున్నారని తెలుసు
పేదవాడి నోట్లో మట్టి కొడుతున్నారని తెలుసు
ఏమైనా చెయ్యాలనుంది, టైమేదీ?
నేనూ ఓ సగటు భారతీయుణ్ణి, నాకేం పెద్దగా తెలీదు

-:-:-:-:-:-

నేనో సగటు భారతీయుణ్ణి, నాకేమీ తెలీదు
ఆమధ్య హైదరాబాదులో బాంబ్లాస్టులు అయ్యాయని తెలుసు
ఫ్లయ్యోవరు కూలిందని తెలుసు
పేలాక పేలాయనీ, కూలాక కూలిందనీ తెలుసుగాని
అంతకంటే నాకేమీ తెలియదు
నేనో సగటు భారతీయుణ్ణి, నాకేమీ తెలీదు

ప్రకటనలు

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.