దిల్ సే …

మార్చి 15, 2008

రెండు సరదా సన్నివేశాలు

అవి నేను బైకు నడపడం కొత్తగా నేర్చుకుంటున్నరోజులు…

వెధవ ఆవేశం… డ్రైవింగు వచ్చీరాకుండానే మొదటిసారి మెయిను రోడ్డుమీదకి బయలు దేరాను. నాకలే భయమెక్కువ. కొంచెం దూరంలో జంక్షనూ, ట్రాఫిక్‌లైట్లూ పక్కనే యమభటుడిలా ఒక ట్రాఫిక్ కానిస్టేబులు. రెడ్‌లైటు పడుతుందేమోనని భయం.
ట్రాఫిక్ పోతూందీ…
పోతూందీ…
పోతూందీ…
“దేవుడా రెడ్‌లైటు పడకుంటా ఉంటే బాగుణ్ణు” అనుకుంటుండగానే రెడ్‌లైటు పడటమూ నా బైకు ఆగిపోవటమూ కొంచెం అటూ ఇటూగా జరిగిపోయాయి. కొత్త బైకూ, కొత్త పెళ్ళామూ ఒక పట్టాన లైన్లో పడవంటారు. తగ్గట్టు డ్రైవింగు కొత్త. ఇంక చెప్పేదేముంది? గ్రీన్ లైటు పడేవరకూ బైకు స్టార్టవక పోవకపోవటమూ, కానిస్టేబులు మనల్ని పక్కకి పిలవడమూ నాచురల్‌గానే జరిగాయి. కొంతసేపు సర్ది చెప్పబోయాను. ఏమాత్రమూ వదిలేట్టుగాలేడు. నెలాఖరు అనుకుంటా! వాడిమొహానేమయినా కొడదామా అంటే జేబులో పర్సు లేదు.
అసలు ట్విస్టు ఇక్కడ వుంది. “I really need to go $#@!…Blah…Blah..” అని మొదలు పెట్టి డిక్షనరీ లోమాత్రమే తగిలే కాస్త గఠ్ఠి పదాలు నాలుగు అద్దాను. ఈ ట్రిక్కు ఎప్పుడయినా వాదించేప్పుడు తప్పనిసరయితే వాడేవాణ్ణి. అవతలివాడు ఇంగ్లీషులో కొంచెం వీక్ అయితే ఈ ట్రిక్ భలే పని చేస్తుంది. వాడి ఈగోకి గట్టి దెబ్బేతగులుతుంది. ఆటోమాటిక్‌గా డిఫెన్సులో పడతాడు. ఇదే అదనుగా మనం ఇంక వాణ్ణి ఆడుకోవడమే. ఆ ట్రిక్కు ఇప్పుడు కూడా పని చేసింది.
నేను మాట్లేడేది తనకి అర్థం కావట్లేదని అతని మొహంలో రంగులు మారడం చెబుతూంది. ఇంకేముంది, రెట్టించిన ఉత్సాహంతో మరి నాలుగు పదాలు అద్దాను. “ఇంత చదువుకుంటారూ… డ్రైవింగు లైసెన్సులుండవూ…” అంటూ చిన్నగా నసిగి వెళ్ళనిచ్చాడు ట్రాఫిక్ కానిస్టేబులు. హమ్మయ్య, అనుకుని బయట పడ్డాను  🙂

o~8~O~8~o

కాలేజీ రోజుల్లో …

ఆ శనివారం దూరదర్శన్ లో “మాతృదేవోభవ” వస్తుంది. జనరల్‌గా D.D లో సినిమా అంటే మా బ్యాచ్‌లోంచి ఎవ్వడూ చూడడు. ఒకవేళ ఏదయినా మంచి సినిమా వచ్చినా సరే, ఎవడయినా చూస్తున్నాడంటే వాడిని ఆతర్వాత రెండుమూడు వారాలు “పండగ” చేసుకుంటారు ఫ్రెండ్స్అంతా కలసి.
సరే, సినిమా స్టార్ట్ అయ్యింది…
మాబ్యాచ్ లోంచి ఒకడన్నాడు “అరే ఒకట్రెండు సీన్స్ బావుంటాయిరా. అవి రెండూ చూసొస్తా, పనిలో పనిగా యెవడయినా వున్నారేమో చూసొస్తా; రేపటికి మనకి యెవడైనా బకరా కావాలిగా” అని. అన్నవాడు చిన్నగా జారుకున్నాడు. వాడి వెంట ఇంకొకడు, ఆ పై మరొకడు. నావంతు రాకముందే మిగిలిన ఒక్కణ్ణీ తీసుకుని బయలుదేరాను. యెవడయినా రెడ్‌హ్యాండెడ్‌గా దొరికితే పండగ చేద్దామనుకుని వెళ్ళాము.

అంతా నిశ్శబ్దం… చీమ చిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్దం. ఒకడు పైకి సౌండ్ రాకుండా చిన్నగా ఏడుస్తున్నాడు, వాణ్ణి ఏదో కామెంటు చెయ్యబోతే పక్కవాళ్ళంతా మమ్మల్ని వింత మనుషుల్లా చూశారు. సరే ఇక చేసేదేముంది… మేమూ చూడ్డం మొదలెట్టాం. కొంతసేపటికి నాకూ యేడుపొచ్చింది. యేడిస్తే ఎలా, కంట్రోల్ చేసుకున్నా. ఇంకాసేపటికి కంట్రోల్ చేసుకోవడం నావల్లకాలేదు. నారూములోకెళ్ళి బోల్టు పెట్టుకుని ఐదు నిమిషాలసేపు ఏడ్చేశా. నీట్‌గా మొహం కడుక్కుని మళ్ళీ సినిమా చూస్తున్న వాళ్ళతో జాయినయ్యా.

ఇంతలో జరక్కూడనిది జరిగి పోయింది, బ్యాచ్‌లోంచి యెవడో చూడనే చూశాడు. ఇక చెప్పేదేముంది…తర్వాత రెండుమూడు వారాలు నేను బలి…

o~8~O~8~o

ప్రకటనలు

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.